అమెరికా వీసాల గుండుగుత్త పొడిగింపు ఉండదు


కోవిడ్-19 ఎమర్జెన్సీ కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న ప్రవాసేతర వీసాదారుల నివాస గడువు పొడిగింపు ప్రత్యేకంగా పరిశీలించడం లేక ఆయా సందర్భాన్ని బట్టి సత్వరం ప్రాసెస్ చేయడం జరుగుతుందని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. వ్యాపార, పర్యాటకాలకు ఇచ్చే బీ-1, బీ-2 వీసాలు, విద్యార్థులకు ఇచ్చే ఎఫ్-1 వీసాలు, ప్రధానంగా రిసెర్చ్ స్కాలర్లు, వైద్యుల  ఎక్స్చేంజికి ఇచ్చే జే-1 వీసాలు, ఐటీ నిపుణులకు ఇచ్చే హెచ్-1బి, కంపెనీ మేనేజీరియల్, ఎగ్జిక్యూటివ్ అధికారుల అంతర్గత బదిలీలకు ఇచ్చే ఎల్-1 వీసాలు ప్రవాసేతర వీసాల కిందకు వస్తాయి. కరోనా కల్లోలం కారణంగా అమెరికాలో ఇబ్బందులు పడుతున్నవారి నివాస అనుమతిని ఆయా సందర్భాన్ని బట్టి పొడిగించడం జరుగుతుందని అమెరికా పౌరసత్వ, వలసల సేవా విభాగం (యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది. గుండుగుత్తగా అన్నని వీసాలను పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తమ నియంత్రణలో లేని అసాధారణ పరిస్థితుల కారణంగా ఇబ్బందులు పడేవారు కోరితే వారికి పొడిగింపు ఇవ్వడం జరుగుతుందని యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది. సకాలంలో దరఖాస్తు చేసుకునేవారిని చట్టవిరుద్ధంగా కొనసాగుతున్నవారిగా భావించబోమని వివరించింది. గడువులోగా దరఖాస్తు చేసుకుంటే 240 రోజుల వరకు వీసాను పొడిగిస్తారు.