10 రోజులు కీలకం

కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకోవాలని మంత్రులు కే తారకరామారావు, ఈటల రాజేందర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొవిడ్‌-19 నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రతిరోజూ ఉదయం ప్రగతిభవన్‌లో సమావేశం కావాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్‌ మంగళవారం తన క్యాంప్‌ కార్యాలయంలో మంత్రి ఈటలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించడమొక్కటే మార్గమన్నారు. హైదరాబాద్‌లోని కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో నూటికి నూరుశాతం లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాల్సిందేనని, అధికారులు అన్ని రహదారులను పూర్తిగా మూసేసి ఏ ఒక్కరూ బయటకు రాకుండా చూడాలని చెప్పారు. పోలీసుల పహారాలో ఒక్క మార్గాన్నే తెరిచి ఉంచాలన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు వారి ఇంటికే పంపే ఏర్పాట్లు చేయాలని, ప్రజలకు ఎవరైనా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలనుకుంటే పోలీస్‌, మున్సిపల్‌ అధికారులను సంప్రదించాలని సూచించారు.