ల‌క్ష‌ల కొలువులు వూస్టింగ్‌

కోవిడ్‌-19 వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌యం సృష్టిస్తున్న‌ది. అంత‌ర్జాతీయ వాణిజ్య‌మే కాకుండా దేశీయ వ్యాపారాలు కూడా మూత ప‌డ‌టంతో వ‌చ్చే కొన్ని వారాల్లో ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోతార‌ని ప్ర‌ముఖ రేటింగ్ సంస్థ మూడీస్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. క‌రోనా ఉత్పాతం ప్రపంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో సునామీని సృష్టించ‌నుంద‌ని పేర్కొంది.  ఉద్యోగాల తొల‌గింపు పెరిగిపోవ‌టం, వ్యాపారాల్లో పెట్టుబ‌డులు త‌గ్గ‌టం, రిటైర్‌మెంట్ ప్ర‌ణాళిక‌లు ఆవిరైపోవ‌టం త‌దిత‌ర కార‌ణాల‌తో ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లు మ‌రింత ఒత్తిడిని ఎదుర్కోనున్నాయ‌ని మూడీస్ ప్రధాన ఆర్థికవేత్త మార్క్ జందీ అభిప్రాయ‌ప‌డ్డారు. 


వ‌చ్చే కొన్నివారాల్లో ముఖ్యంగా హౌస్‌హోల్డ్ ఉద్యోగాలు ల‌క్ష‌ల్లో కోల్పోయే ప‌ర‌స్థితి ఉంద‌ని అంచ‌నా వేశారు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో కోవిడ్‌-19 వైర‌స్ బ‌య‌ట‌ప‌డిన కొత్త‌లో ఈ ఏడాది ప్ర‌పంచ వాస్త‌వ జీడీపీ 2.6శాతం ఉండ‌వ‌చ్చ‌ని మూడీస్ అంచ‌నా వేసింది. అయితే వైర‌స్ అసాధార‌ణ స్థాయిలో విజృంభించ‌టంతో 2020లో  0.4శాతానికి ప‌రిమితం కావ‌చ్చ‌ని తాజాగా అంచ‌నా వేసింది. ప‌ర్యాట‌కం, వాణిజ్యం స‌హా అన్నిర‌కాల వ్యాపారాలు మూత‌ప‌డ‌టంతో ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉండ‌నుంద‌ని వెల్ల‌డించింది. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న‌వారి సంఖ్య వారానికి 2,00000 దాకా ఉంద‌ని ఆ దేశ అధికారులు అంటున్నారు. వ్యాపారాల‌న్ని ఒక్క‌సారిగా ఆగిపోవ‌టం ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌కు దారుణ‌మైన న‌ష్టం క‌లిగిస్తుంద‌ని జందీ అభిప్రాయ‌ప‌డ్డారు.