పోలీస్‌స్టేషన్లను సందర్శించిన ట్రైనీ ఎస్సైలు

పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలను తెలుసుకునేందుకు ఆదివారం 13 మంది ట్రైనీ ఎస్సైలు నార్సింగి, శంషాబాద్‌ ఆర్‌జిఐఏ పోలీస్‌స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని పలు రికార్డులు, ఎఫ్‌ఐఆర్‌ నమోదు, ఫిర్యాదుదారుడితో మాట్లాడే విధానం, రిమాండ్‌ రికార్డుల నమోదులు, పోలీస్‌స్టేషన్‌లో ప్రజలకు అందిస్తున్న సేవలు.. ఇలా పలు అంశాలపై వారు స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, శంషాబాద్‌ ప్రభుత్వ పాఠశాలను, నార్సింగిలోని సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహంలోని విద్యార్థినులను కలిసి వారితో కాసేపు ముచ్చటించారు. వసతి గృహంలో సరైన సౌకర్యాలు అందుతున్నాయా.. అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి సదుపాయాన్ని వినియోగించుకొని, జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా ట్రైనీ ఎస్సైలు విద్యార్థినులకు స్ఫూర్తి కలిగించారు.