ప్రపంచ ఆకర్షనీయ ప్రదేశాల్లో ఏడు భారత నగరాలు

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా 100 ఆకర్షనీయ ప్రదేశాల్లో భారత్‌కు చెందిన ఏడు నగరాలకు చోటు లభించింది. యూకేకు చెందిన గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ యూరోమానిటర్ ఇంటర్నేషనల్ స్టేట్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్. చారిత్రక, సాంస్కృతిక వారసత్వం, భిన్నత్వంలో ఏకత్వం, అందుబాటులో ధరలు వంటి పలు అంశాలు ఆయా నగరాలకు సానుకూలతగా ఉన్నాయి. మౌలిక వసతుల కల్పన, అంతర్జాతీయ విమానాశ్రయం, లగ్జరీ, మెడికల్, స్పోర్ట్స్, కల్చర్ టూరిజం వంటి అంశాలు ఆయా నగరాలకు జాబితాలో స్థానం దక్కేందుకు దోహదంగా ఉన్నాయి. టాప్ 100 జాబితాలో స్థానం దక్కించుకున్న ఏడు నగరాల వివరాలిలా ఉన్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీ 11వ స్థానంలో.. దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబయి 14వ స్థానంలో.. ప్రేమికుల చిహ్నాన్ని మదిలో పొదువుకున్న ఆగ్రా నగరం 26వ స్థానంలో.. తమిళనాడు రాజధాని నగరం చెన్నై 31వ స్థానంలో.. పింక్ సిటీ జైపూర్ 34వ స్థానంలో.. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా నగరం 74వ స్థానంలో.. కర్ణాటక రాజధాని నగరం బెంగుళూరు 100వ స్థానంలో ఉన్నాయి. 24 గంటలకు మించి అదేవిధంగా ఏడాదికి తగ్గకుండా పర్యాటకులు ఆయా నగరాల్లో ఉండటం సర్వేకు పరిగణగా నిర్వాహాకులు తీసుకున్నారు. ఇంతకు టాప్ వన్ స్థానం ఏ దేశానిది అనుకుంటుకుంటున్నారా? హాంకాంగ్. ఈ ఏడాది సైతం హాంకాంగ్ తన నెంబర్ వన్ స్థానాన్ని పదిలపరుచుకుంది.